పునరపి జననం

ఆగస్ట్ 3, 2013

నా  కింకా అక్కడే ఉన్నట్లు జ్ఞాపకం

నా బాల్యం లోని గత  స్మృ తుల్ని నెమరువేసు కొంటున్నట్లు జ్ఞాపకం

గతంలో జార విడిచిన స్వప్న సింధూరాలు

మళ్లి   శ్వాసిస్తున్నట్లు జ్ఞాపకం

మస్తిష్కం లో తళుక్కు మంటున్న గతానుభవాల స్మృతులు

నన్ను అమృత సరస్సులో నిలువెత్తున ముంచెత్తుతున్న అనుభూతులు

మానస సరోవరంలో  ఆనంద బ్రహ్మ కమలాలను

స్పృశిస్తున్నట్లుగా  జ్ఞాపకం

నా కింకా నా గుండెల్లో నేను  కరగి పోయినట్లు

నా తనువు  నా ఆత్మతో సంగమిస్తున్నట్లు

నా మదిలో  జాగృతమైన ఆలోచనా తరంగాలు

ఒక భావ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నట్లుగా జ్ఞాపకం

సిద్ద యోగిలా తనువు  నొదిలి నా ఆత్మ ఎక్కడికో

సుదూర తీరాలకు ప్రయాణం చేస్తున్నట్లు

రాత్రి పగలు మమేకమయ్యే సుందర తీరానికి చేరుకోన్నట్లు

సముద్రపు మధ్యన నిలబడి అలల మిద కూర్చొని పయనం సాగిస్తున్నట్లు

ఎగిరి ఎగిరి ఆకాశం లో ముందుకు సాగే కరిమబ్బుల  వెనకాల దాగొన్నట్లు

శూన్యం లోకి అడుగులు వేసి సుదూర గ్రహాల్ని దాటి

ఆత్మ సందర్శనం చేసుకొన్నట్లు జ్ఞాపకం !

ప్రకటనలు

చెట్లు శపిస్తాయి

జూలై 28, 2013

చెట్లు
తపిస్తాయి
చెట్లు
శపిస్తాయి
  నీటి కోసం
తపిస్తాయి
ఎండి పొతే
  శపిస్తాయి
చెట్లు మాట్లాడుతాయి
  చెట్లు ఏడుస్తాయి
  అషాడంలో ఆడుకొంటాయి
  వైశాఖంలొ ఏడ్చుకొంటాయి
  దయలేని మానవుల్లారా !
మా గుండెల్ని చీల్చకండి
  మా తలల్ని నరకకండి
  కొమ్మల చిట్టి తల్లులు
  ముద్దులొలుకుతున్న
  మా చిన్నారి పూమొగ్గల్ని
  చిదమకండి
  మా గొంతు తడపడానికి
  చుక్క నీరందకుండా
  సిమెంటు రోడ్లు తో  నింపేశారే!
పచ్చని  చెట్లున్నఅడవుల్ని
  అభివృద్ధి పేరుతొ
  దహించి వేసారే!
దయ లేని మనుష్యు లారా !
మీ కిది న్యాయమా?
కాకులు దూరని కారడువులు లేవు
చీమలు దూరని చిట్టడవుల్లేవు
  పచ్చని చెట్ల మీద  వాలే పక్షులు లేవు
  తళ తళ లాడే తటాకులు లేవు
  మమ్మల్ని కాపాడే  ఆదివాసీలు  లేరు
  మనిషి  మళ్లి మనిషయితే  తప్ప
మా  బ్రతుకులు  మళ్లి  చిగురింపవు!

సమస్యా పూరణం

జూలై 24, 2013

సమస్యల
రహస్యాలెమిటో
ఇంతవరకూ నాకర్థం గావడం లేదు
జీవిత మంతా
సమస్యల వలయమే!
ఒక్కొక్క సమస్యా
జారుడు మెట్లులా
వదల గొడుతూంటే
పిల్లాడొదుల్తున్న
సబ్బు బుడగల్లా
మళ్ళీ పుట్టుకొస్తున్నాయి
దూది పింజల్లా
గాలి లోకి సర్రున ఎగురుతున్నాయి
ఆశల మిణుగురు పురుగులు
ఈత చెట్లల్లో తిరుగుతున్నప్పుడు
ఆ కటిక చీకట్లలో
అక్కడక్కడా వెలుతురు చుక్కలు
కనపడుతున్నాయి
ప్రతి సమస్యా
ఒక సిస పద్యమై
ఛందస్సు రాక
సమస్యా పూరణం చేత గాక
అసంతృప్తి పురాణాన్ని
వ్రాస్తూనే వున్నాను

24.07.2013 ( నా ‘సాగర మథనం’ సంకలనం నుండి -1990 లొ రాసినది )    

 

 

జెనెరేషన్ గ్యాప్

జూలై 23, 2013

మా భవనాలు మొలుస్తున్నాయి

మా పునాదులు పూస్తున్నాయి

మా కాంక్రీట్ తో కట్టిన గోడలు

పగల బడి నవ్వుతున్నాయి

మా రంగుల కొంపలు

సీతాకోక చిలుకల్లా ఎగురుతున్నాయి

మేము కట్టుకొన్న అశా సౌధాలు  

మా శవ పేటికలో భద్రంగా దాచ బడ్డాయి

మేము నిలబెట్టిన సిమెంట్ దిమ్మెలు

మా శరీరాలకు వెన్నెముక గా నిలబడ్దాయి

మా చెమట బిందువులతో తడిసిన

ఈ తోట బంగారు కాయలు కాచింది

మా అడుగుల ముద్రలతొ

ఈ నేల పచ్చని చిత్తరువుగా మారింది 

మేము కట్టుకొన్న ఆశాసౌధాల్లో

కొన్నేళ్ళ్ తర్వాత మా ఆత్మలు తిరుగుతాయి

మెము మరణించిన తర్వాత

మా ముని మనమలు మా చిరునామా కోసం వెదుకుతారు  

మేము వదలి పోయిన వెండి కంచాల్లొ

వాళ్ళు పంచ భక్ష్య పరమాన్నాలు తింటారు

మేము రహస్య పేటికలలో దాచుకొన్న

స్వర్ణ స్మృతులను వాళ్ళు బయటికి విసిరి వెస్తారు

మెము  కాపాడిన సభ్యతను

వాళ్లు ఫినాయిల్ తో కడిగి వేస్తారు 

మేము పెంచిన సంస్కారాన్ని

వాళ్ళు భూస్థాపితం  చేస్తారు 

మేము కట్టిన భవంతుల్లో

వాళ్ళు డాలర్ల ముళ్ళను పరచి వేస్తారు

విదేశీ వ్యామోహములో  

తరాలు మారాయి

అంతరాలు మారాయి

ఇప్పుడు  ఆ ఇల్లు

జీవం లేని శిల్పంగా పడి ఉంది 

ఆ ఇల్లు నిశ్శబ్ధ గీతమయ్యింది  .

 

నిశ్శబ్ద గీతం

జూలై 21, 2013

నువ్వెప్పుడైనా నిశ్శబ్ద గీతం విన్నావా?

ఒక్క సారి ఏకాంతంలో నీ  చెవులలో మ్రోగే  ఓంకారనాదాన్ని విన్నావా?

చూరు నుండి బొట్టు బొట్టు కారే నీటి శబ్దం లో ఒక రాగం విన్నావా ?

నీ  స్నానాల గదిలో నీటి భాష ను విన్నావా ?

సన్నని తుంపర చేసే   సరికొత్త  రాగం విన్నావా?

ఆషాడ మాసంలో తల లూపే  చెట్లలో వినపడే ఆనంద  రాగం  విన్నావా?

రైలు వెంబడి పరుగెత్తే మేఘాలు పాడే  మోహన  రాగం విన్నావా?

సంధ్యా సమయంలో పక్షలు జేసే జుగల్ బంది విన్నావా?

సాయంకాలపు నీరెండలొ సముద్రం జేసే సవ్వడి రాగం విన్నావా?

టిక్ టిక్ మంటూ గడియారపు ముళ్ళు జేసే లయ విన్యాసం విన్నావా?

శ్రీమతి జేసే గాజుల సవ్వడి విన్నావా ?

అందాల పాప కు తొడిగిన గజ్జెల సవ్వడి  విన్నావా?

గంగిరెద్దుల వాడి విన సొంపయిన సన్నాయి రాగం విన్నావా?

రాగ రంజిత మైన జీవన రాగం విన్నావా?

 

చెట్లు

జూలై 18, 2013

చెట్లిప్పుడు చెరచ
బడ్ద అడవి తల్లులు

చెట్లిప్పుడు చిగురు
కొమ్మలని కనలేని
గొడ్రాళ్ళు

చెట్లిప్పుడు పక్షుల
గూళ్ళకు పనికి రాని
ప్రాంగణాలు
 
చెట్లిప్పుడు శిలువకు
బలి అయిన
ఏసుక్రీస్తులు
 
చెట్లిప్పుడు తలలు
నరికిన మొండేళ్ళు 

చెట్లిప్పుడు తోడు
లేని అనాధ ప్రేతాలు

చెట్లిప్పుడు కాళ్ళు
లేని సైనికులు 

చెట్లిప్పుడు నీడ
నివ్వలేని నిశాచరులు

చెట్లిప్పుడు గుడ్ల
గూబలకు అవారాలు

చెట్లిప్పుడు
మరణానికి రాసుకొన్న
ఉత్తరాలు

చెట్లిప్పుడు మనిషి
ప్రేమకు దూరమైన
అభాగ్యులు

చెట్లిప్పుడు
కాష్టానికి పనికొచ్చే
పాడె కట్టెలు      

కావ్యం

జూలై 14, 2013

నేను భౌతికంగా  ఈ ప్రపంచంలో లేక పోయినా
నా రచన లన్నీ శాశ్వితంగా ఉంటాయి
ఒక పాఠకుడు  నా గ్రంధాన్ని బీ రువాలో దాచుకొన్నా
ఒక పాఠకుడు గుండెల్లో భద్రంగా దాచుకొంటాడు
ఒక భావం ఉద్రేకాన్ని కలిగించినా
ఇంకొక భావం మస్తిష్కం లో ఉండి పొతుంది శాశ్వితంగా
కవి వ్రాసిన కావ్యం
అందరికీ ఇష్టమవుతుందని నేను అనుకోను
వంద మందిలో ఒక్కడయినా చదివి
జీవితాన్ని మార్సుకోన్నా అది కవి చేసుకొన్న అదృష్టం
కావ్యానికి కళ్ళు లేవు
అది నడచు కొంటు వెళ్ళదు
కావ్యానికి నోరు లేదు
అది మాట్లాడదు
కానీ కావ్యానికి అక్షరాల భాష ఉంది
అది పాఠ కుడి హృదయాన్ని తాకుతుంది
అరలలో అమ్ముడు పోకుండా పేరుకుపోయి వుండొచ్చు ఆ కావ్యం
గానీ పుస్తకం తెరచి పుటల హృదయాలను చదివితే
ఈ జన్మకి చాలినంత సంతృప్తి దొరకవచ్చు
కవి రాసిన కావ్యం
కొందరి జీవితాలలో అమృత వర్షం కురిపించ వచ్చు
కవి రాసిన గేయం
కొందరిని మానవతా మూర్తులుగా మార్చవచ్చు !

నా ‘సాగర మథనం ‘కవితా సంపుటి ఆవిష్కరణ మహోత్సవ సందర్భంగా రాసిన కవిత

10.4.2000

పరాన్న జీవులు

జూలై 11, 2013

కొందరు చిలవలు పలవలు గా
అబధ్దాల  కత్తులకు పదునులు పెడుతూ
కాలం గడుఫుతూ ఉంటారు
వాళ్ల రక్తంలో  చక్కెర అధిక శాతం ఉంటుంది
కాని వాళ్ళు మధు మేహ వ్యాధి గ్రస్థులు గాదు
వాళ్ళు తియ్యగా మాట్లాడ గలరు
అడవిలో పూచే రాక్షస పూలు వంటి వారు
వాలిన ప్రతి జీవాన్ని కూడ బలుక్కుని
అమాంతంగా నోట్లోకి  జార విడుచు కొంటారు 
నింపాదిగా కూర్చొని రక్తాని జుర్రు కొంటారు
అవసరానికి ఆసరా ఇవ్వరు వాళ్ళు
అప్పనంగా వచ్చి పచ్చని చెట్టు మీద వాలే పక్షుల్లా వాలుతారు
అందని ద్రాక్ష పళ్ళ  కోసం అర్రులు చాచే రకం వాళ్ళు
వాళ్ల పిడి వాదానికి  మీరు మీ పిడికిళ్ళు తెరుస్తారు
మీ గుండె కేరింతలు కొడుతుంది చిన్నపిల్లలా
మీరు హిప్నటైజ్ చేసిన వ్యక్తిలా వాళ్ళు చెప్పింది చేస్తారు
ఆకాశంలొ హరివిల్లుని అనుకొన్నప్పుడు చూపించ గలరు
అవధూత లక్షణాలు వాళ్ళళ్ళో ఎక్కువుంటాయి
కానీ వాళ్ళు మాయలేడి రూపంలో  ఉన్న మారీచులు  
అద్దంలో వాళ్ళ ముఖం వాళ్ళు చూసుకోలేరు  
నీ ముఖాన్నే  అద్దంగా మార్చి వాళ్ళు చూసుకొంటారు 
నీ కనుపాపల్లొంచి వెలుతుర్ని వాళ్ళు వెతుక్కొంటారు 
నీ ముక్కు లోంచి వాళ్ళు శ్వాసని పీల్చ గలరు
వాళ్ళు బ్రతక నేర్చిన వాళ్ళు
వాళ్ళే పరాన్న జీవులు
—————————————————-
రచన : వారణాసి భానుమూర్తి రావు

భాను బాణీలు

జూలై 6, 2013

1

ఎండల్లో మాడి పోయి

పిట్టల్లా రాలిపొయ్యారు జనం!

ఎ సి రూముల్లో బొజ్జ నిండా మెక్కి

తొంగున్నారు ప్రజానాయకులు పాపం!

2

నోటుతో వోటు కొనుక్కున్నాడు వాడు

నోటు నొక్కే అధికారం తనకే ఉందన్నాడు

పదవొచ్చాక కమీషన్లు కూడబెట్టాడు

ఇదే మన ‘డెమోక్రసి’ అన్నాడు

3

నా కనిపిస్తోంది

మానవ జాతి మరణ శాసనం రాస్తొందని-

స్వార్ఠపు సిరాతో

ఈర్ష్యా ద్వెషాల కలంతో!

4

తల్లి ఆలనా

తండ్రి పాలనా

కావాలి పిల్లలకు రెక్కలోచ్చేదాకా-

రెక్కలుడిగిన తల్లీ తండ్రికి

వృద్ధాశ్రమాలే ఆలనా పాలనా చచ్చే దాక!

రచన: భాను వారణాసి

06.07.2013

భాను బాణీలు

జూలై 5, 2013

1

మనకు కనబడే చంద్రుడు కవులకు కవితా వస్తువు

రసజ్ఞులకు రసాస్వాదనుడు

ప్రేమికులకు శృంగారోద్ధీపకుడు

గానీ నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుని మీద దిగ గానే

దర్శన మిచ్చింది రాళ్ళు రప్పలూ!

2

సముద్రాలుండేది మానవజాతికి ఆలంబనగా

సముద్ర జీవరాశులకు కన్న తల్లిగా

కల్మష మైపోతున్న సముద్ర జలాలు

నిర్వీర్వమైపొతున్న సముద్రాలు

మనిషి ప్రగతిని ఎప్పుడొ ఒకప్పుడు ముంచేస్తాయి!

3

నువ్వు చచ్చిన తర్వాత నీక్కావలసింది ఆరడుగల నేల

పాతిపెట్తడానికి-

ప్రపంచమంతా నీక్కావాలనే దురాశ నీకెందుకు?

4

ఆణు బాంబుల నిల్వలు బాగానే పెంచుకొంటున్నాయి దేశాలు

మానవ జాతికి మరణ శాసనాలు అందరూ బాగానే వ్రాస్తున్నారు!

5

నువ్వు తినే ప్రతి అన్నం మెతుకులో

నువ్వు తినే ప్రతి గొధుమ గింజలో

రైతన్న రక్తం దాగుందని మరచిపోకు నేస్తమా!

6

తండ్రికి తెలీదు

బిడ్దకు తెలీదు

పురిటి నెప్పుల బాధ

మాతృమూర్తికే తెలుసు!

7

సిజరిన్ ఆపరేషన్ లో

జన్మ నిచ్చిన తల్లి

పునర్జన్మ పొందింది మళ్ళీ!

అయినా ఇంకో బిడ్డకు జన్మ నివ్వడానికి

తయారయింది మళ్ళీ మళ్ళీ!

8

పదిమంది సంతాన్నయినా

ఆనందంగా పొషిస్తారు తల్లీ తండ్రీ

గానీ ఆ తల్లీ తండ్రి అవసాన దశలో చాకడానికి

పోటీలు వేసుకొంటారు ఆ పిల్లా జెల్లా!

9

సూర్యుడు మండుతుంటే గదా

ప్రపంచం ముందుకు వెళుతుంది

కానీ ఆ సూర్యుడు ఒక్కసారిగా ఆగిపోతే

భయంకర నిశ్శబ్ధం, కటిక చీకటి

రచన : భాను వారణాశి

05.07.2013